SILICON VALLEY BANK | ఎస్వీబీలో 500 మంది ఔట్.. తేల్చేసిన ఫస్ట్ సిటిజన్స్ సీఈఓ ఫ్రాంక్ హోల్డింగ్

Silicon Valley Bank | సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ).. ఒకనాడు ప్రపంచవ్యాప్త స్టార్టప్ సంస్థలకు ఇన్వెస్ట్‌మెంట్ కేంద్రం.. కానీ, ఇటీవల బ్యాంకులో తలెత్తిన ఆర్థిక సంక్షోభం.. ఎస్వీబీ పూర్తిగా దివాళా తీసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దాని యాజమాన్యం ‘ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్’ పరిధిలోకి వెళ్లింది. పనితీరు మెరుగు పర్చడంపైనా.. నిధుల పొదుపు పైనా ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కేంద్రీకరించింది. అందుకోసం 500 మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ‘కార్పొరేట్ సంస్థలు, క్లయింట్లతో లావాదేవీల్లో భాగస్వాములుగా ఉన్న వారిని తొలగించబోం. కేవలం ఎస్వీబీ కార్పొరేట్ విధులు నిర్వర్తిస్తున్న ఎగ్జిక్యూటివ్’లను మాత్రమే తొలగిస్తామని ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ సీఈఓ ఫ్రాంక్ హోల్డింగ్ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సిబ్బందికి పంపిన ఈ-మెయిల్‌లో ఫ్రాంక్ హోల్డింగ్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ ఆధీనంలోని ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ)లో ఉద్యోగుల తొలగింపు గురించి తొలుత అమెరికా కేంద్రంగా పని చేస్తున్న న్యూస్ వెబ్‌సైట్ ‘యాక్సియోస్’ వార్తాకథనం ప్రచురితమైంది. సుమారు కంపెనీ సిబ్బందిలో మూడు శాతం ఉద్వాసనలు ఉండవచ్చునని బీబీసీ తెలిపింది. బ్రిటన్‌లోని ఎస్వీబీ లావాదేవీలను హెచ్ఎస్‌బీసీ కేవలం ఒక పౌండ్‌కే టేకోవర్ చేసింది.

అమెరికాలో ఎస్వీబీతోపాటు సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలడంతో వివిధ దేశాల ప్రభుత్వాలతోపాటు ప్రపంచ ఇన్వెస్టర్లు ఆందోళనకు గరయ్యారు. ఎస్వీబీ పతనం వెంటనే స్విట్జర్లాండ్‌ బ్యాంక్ ‘క్రెడిట్ సూయిజ్’ కూడా కుప్పకూలింది. పరిస్థితి విషమించకుండా క్రెడిట్ సూయిజ్ బ్యాంక్‌ను ఆ సంస్థ ప్రత్యర్థి సంస్థ యూబీఎస్ టేకోవర్ చేసింది.

నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తున్న ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ ఇటీవలి కాలంలో సంక్షోభంలో చిక్కుకున్న అతిపెద్ద బ్యాంకుల్లో ఒక బ్యాంకును టేకోవర్ చేసింది. ఇదిలా ఉంటే ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకు సీఈఓలను అమెరికా కాంగ్రెస్ కమిటీ సారధ్యంలో చట్టసభల ప్రతినిధులు ప్రశ్నించారు. ఆయా బ్యాంకుల రిస్క్ మేనేజ్ మెంట్ పద్దతులు, ఎగ్జిక్యూటివ్ లకు భారీ వేతన ప్యాకేజీలు ఇవ్వడంపై ఆ రెండు బ్యాంకుల సీఈఓలను ప్రశ్నించారని సమాచారం.

2023-05-25T12:05:22Z dg43tfdfdgfd