Ola Electric IPO | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ త్వరలో ఐపీవోకి వెళ్లనున్నది. వచ్చే డిసెంబర్ లోపు దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి సన్నాహాలు చేస్తున్నది. తమ వాటాల విక్రయానికి కొటక్ మహీంద్రా బ్యాంక్, గోల్డ్ మాన్ శాక్స్ బ్యాంకులను ఫైనాన్సియల్ అడ్వైజర్లుగా నియమించుకున్నది. ఓలా ఎలక్ట్రిక్ తన ఐపీవో ప్రక్రియ పూర్తి కోసం పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో జత కట్టనున్నదని తెలుస్తున్నది. అయితే, ఐపీవో ద్వారా ఎంత మొత్తం నిధులు సేకరించాలన్న విషయమై ఇంకా ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళిక ఖరారు చేయలేదు.
ఇప్పటికైతే ఓలా ఎలక్ట్రిక్‌లో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడులు పెట్టాయి. గతేడాది నిధుల సమీకరణ వేళ.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విలువ 500 కోట్ల డాలర్లుగా గణించారు. గతేడాది నిర్ణయించిన 500 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ విలువతో ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం సన్నద్ధం అవున్నది. అలా పెరిగిన మార్కెట్ విలువపై 10 శాతం స్టాక్స్ సేల్ అయినా.. అతిపెద్ద ఐపీవోగా ఓలా ఎలక్ట్రిక్ నిలవనుంది.
కానీ, ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం డిసెంబర్ నాటికి ఐపీవో ద్వారా లిస్టింగ్ కావడం కష్టమే. ఐపీవోకు అనుమతించాలని సెబీకి దరఖాస్తు చేయాలి. మార్కెటింగ్ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో డిసెంబర్ లోగా లిస్టింగ్ కావడం అంత తేలిక కాదని చెబుతున్నా.. డిసెంబర్ నాటికి ఐపీవోకు వెళ్లాలని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ పట్టుదలతో ఉన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ వ్యాఖ్యానించింది. ఐపీవో ద్వారా సేకరించిన నిధులు.. సంస్థ కార్యకలాపాల విస్తరణకు వాడుకోవాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయిస్తున్నది ఓలా ఎలక్ట్రిక్. మున్ముందు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు కూడా తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నది. తద్వారా భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ మీద పట్టు సంపాదించాలని ఓలా ఎలక్ట్రిక్ ప్రయత్నిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శరవేగంగా విస్తరించాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో గత మార్చి త్రైమాసికంలో 30 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, ఏడాది పొడవునా 22 శాతం వాటాతో టాప్ లోనే నిలిచింది. తర్వాతీ స్థానాల్లో ఒకినావా, అంపేర్, ఏథర్, హీరో ఉన్నాయి.
2023-05-25T14:35:23Z dg43tfdfdgfd