E-Coommerce Waste | ఇప్పుడంతా డిజిటల్‌మయం.. ఆన్‌లైన్ పేమెంట్స్.. ఆన్‌లైన్ కొనుగోళ్లు.. ప్రతి ఒక్కరూ జరిపే ఆన్‌లైన్ కొనుగోళ్లతో ఇంటికే మనం ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ అవుతాయి. ఆయా వస్తువులతోపాటు వచ్చే ఈ-వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడేండ్లలో 800 మిలియన్ టన్నులకు చేరతాయని ఈ రెండు సంస్థలు నిర్వహించిన రీసెర్చ్ నిగ్గు తేల్చింది. అంటే ఈ-కామర్స్ పార్శిళ్ల వ్యర్థాలు 315 బిలియన్ల నుంచి 800 బిలియన్ డాలర్లకు చేరతాయని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని అంచనా. అదే జరిగితే నాలుగు బిలియన్ల పార్శిళ్ల నుంచి 2030 నాటికి పది రెట్లు పెరిగి 40 బిలియన్ల డెలివరీలకు చేరతాయని ఈ రీసెర్చ్ పేర్కొంది. క్లీన్ మొబిలిటీ కలెక్టివ్ (సీఎంసీ), స్టాండ్ డాట్ ఎర్త్ రీసెర్చ్ గ్రూప్ (ఎస్ఆర్‌జీ) సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపాయి.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఆయా ఆర్డర్ల డెలివరీ పార్శిళ్లతో వెలువడే కర్బన ఉద్గారాలు.. 160 మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ (సీవో2), 400 గ్యాస్ ఫైర్డ్ పవర్ ప్లాంట్లతో సమానం. వచ్చే ఐదేండ్లలో పార్శిళ్లు డెలివరీలు 100 శాతం పెరిగితే 2030 నాటికి 80 లక్షల టన్నుల `సీవో2`తో సమానం. ఇది ఒక ఏడాది 16.2 లక్షల పెట్రోల్ కార్లు విడుదల చేసే ఉద్గారాలతో సమానం. లేదా 20 గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఉద్గారాలతో సమానం.
ప్రపంచంలోనే భారత్ శరవేగంగా పెరుగుతున్నఈ-కామర్స్ మార్కెట్లలో ఒకటి. ప్రపంచ సగటు కంటే శరవేగంగా భారత్ ఈ-కామర్స్ మార్కెట్ 2.2 నుంచి 5.5 రెట్లు పెరుగుతున్నది. భారత్ కొరియర్ మార్కెట్‌లో (ఫ్లిప్‌కార్ట్ లేదా ఈ-కార్ట్, అమెజాన్ లాజిస్టిక్స్, డీహెచ్ఎల్/బ్లూడార్ట్) మూడు సంస్థలు 50 శాతానికి పైగా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. 2030 నాటికి 17 నుంచి 24 బిలియన్ల పార్శిల్స్ ఈ మూడు సంస్థలు డెలివరీ చేస్తాయని ఈ అధ్యయనం తెలిపింది. ఇదే జరిగితే వచ్చే ఏడేండ్లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డీహెచ్ఎల్ అదనంగా 17 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవో2) ఉద్గారాలు వదులుతాయని అంచనా.
మున్ముందు భారత్‌లో ఈ-కామర్స్ బిజినెస్ విపరీతంగా పెరుగుతుందని క్లీన్ మొబిలిటీ కలెక్టివ్ ఇండియా కోఆర్డినేటర్ సిద్ధార్థ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో భారీగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ఈ-కామర్స్ సెక్టార్ కర్బన రహితంగా తీర్చి దిద్దడంతోపాటు ఆర్థికంగా అనుకూలమైంది, భారీగా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది అని చెప్పారు. తద్వారా వాయు కాలుష్యం, ఉద్గారాల నియంత్రణకు దారి తీస్తుందన్నారు.
ఈ సమస్య పరిష్కారానికి ఈ-కామర్స్ సంస్థలు ముందుకు రాకపోతే 2030 నాటికి భూతాపంపైనా, ప్రజల ఆరోగ్యంపైనా గణనీయ ప్రభావం చూపుతుంది అని ఎస్ఆర్జీ ఇన్వెస్టిగేటివ్ రీసెర్చర్ డాక్టర్ దేవయానీ సింగ్ స్పష్టంచేశారు. 2040 నాటికి కర్బన రహిత పార్శిళ్ల డెలివరీ చేస్తామని అమెజాన్ ఇచ్చిన ప్లాన్ మరీ బలహీనం, దశాబ్దకాలం లేట్ అని ఆమె స్పష్టం చేశారు. 2030 నాటికి పార్శిళ్ల డెలివరీకి 100 శాతం ఈవీ వాహనాల్లోకి పరివర్తన చెందుతామని ఫ్లిప్‌కార్ట్ మాత్రమే వాగ్దానం చేసింది.
2023-05-25T13:05:21Z dg43tfdfdgfd