హైదరాబాద్‌ అభివృద్ధి అదుర్స్‌

  • ఎనిమిదేండ్లలో మారిపోయిన రూపురేఖలు
  • ప్రభుత్వ సహకారం బాగుంది
  • డాజోన్‌ గ్రూప్‌ సీఈవో షే సెగెవ్‌ ప్రశంస దూసుకుపోతున్న నగరం

హైదరాబాద్‌, మే 25 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్‌ నగరం గడిచిన ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. నేను గతంలో వేరే కంపెనీలో పనిచేస్తున్నప్పటి నుంచి ఇక్కడికి తరచూ వస్తున్నాను. ఈ మధ్య కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. కార్పొరేట్‌ కార్యాలయాలు, సేవల రంగం, రవాణా, మౌలిక సదుపాయాలు, ఎయిర్‌పోర్ట్‌ కనెక్టివిటీ తదితర అన్ని అంశాల్లో హైదరాబాద్‌ సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత హైదరాబాద్‌ నగర రూపురేఖలే మారిపోయాయి. అత్యంత బిజీ నగరంగా మారింది.’ అని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ సంస్థ డాజోన్‌ సీఈవో షే సెగెవ్‌ అన్నారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ టెక్నాలజీకి సంబంధించిన కొత్త టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. గత ఎనిమిదేండ్లలో హైదరాబాద్‌ సాధించిన ప్రగతిపై ప్రశంసల జల్లు కురిపించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

అన్నీ చూశాకే హైదరాబాద్‌ను ఎంపిక చేశాం

నేను గతంలో కొంతకాలం పుణేలో బ్రిటన్‌కు చెందిన మరో కంపెనీలో పనిచేశాను. అక్కడ స్థానిక నాయకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఎలా చెబితే అలా వినాల్సిందే. అంతేకాదు, మేము హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందు ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించాం. ప్రస్తుతం మా కార్యకలాపాలు కొనసాగుతున్న పోలాండ్‌లో విస్తరించాలని భావించాం. కానీ వాస్తవం చెబుతున్నా.. హైదరాబాద్‌లో పరిస్థితులు చూశాక, మా కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికొచ్చాం.

ఎన్నో అనుకూలతలు

హైదరాబాద్‌కు పెట్టుబడులను ఆకర్షించే అనేక అనుకూలతలున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే నైపుణ్యంగల ఉద్యోగులు ఇక్కడ తక్కువ వేతనాలకే దొరుకుతారు. మేము దశలవారీగా దాదాపు నాలుగున్నర వేలమందిని నియమించుకోవాలని నిర్ణయించాం. ఇతర చోట్ల ఇంత భారీస్థాయిలో ఉద్యోగులను నియమించుకుంటే జీతాలకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. మేము బ్రిటన్‌లోగాని, మరే ఇతర ప్రాంతంలోగానీ 1,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అయినా ఆశించిన స్థాయిలో నిపుణులు దొరకడం కష్టం. ముఖ్యంగా ఇక్కడి సంస్కృతి, ప్రజల నిబద్ధత, విలువలు, ఉద్యోగుల పనితీరు అంతా బాగుంటాయి. ఇటువంటి పరిస్థితులు మనకు ఇతర ప్రాంతాల్లో ఉండవు. అందుకే మేము మా కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాం. ప్రభుత్వ స్నేహపూర్వక విధానాల వల్ల అనుకున్న సమయం కన్నా ఎంతో ముందుగానే కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఐదేండ్లలో భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం.

2023-05-25T19:35:27Z dg43tfdfdgfd