హిట్లర్ గొప్పోడు అన్నందుకు.. ఉద్యోగం పీకేసిన ఐటీ కంపెనీ

హిట్లర్ గొప్పోడు అన్నందుకు.. ఉద్యోగం పీకేసిన ఐటీ కంపెనీ

ప్రపంచాన్ని వణికించిన జర్మనీ నియంత అడాల్ఫ్  హిట్లర్. అతను చేసిన అరాచకాలకు జర్మన్లు నేటికి సిగ్గు పడుతుంటారు. అలాంటి వ్యక్తిని తన హీరో అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి.. ఉద్యోగం పొగొట్టుకున్నాడు. సదరు ఉద్యోగి డెలాయిట్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. సదరు ఉద్యోగి పేరు నీరభ్ మెహ్రోత్రా. అతడు డెలాయిట్‌ సంస్థలో రిస్క్ అడ్వైజరీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం నీరభ్‌ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్‌’ అనే కొటేషన్‌ తో.. నియంత అడాల్ఫ్‌ హిట‍్లర్‌ను పొగిడాడు. హిట్లర్‌ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘తాజాగా నేను 'ది డార్క్‌ చార్మ్‌ ఆఫ్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌' అను బుక్‌ కొన్నాను. ఆ బుక్‌ చదువుతున్న కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపించింది. అది చదివాక హిట్లర్‌ గురించి, వరల్డ్‌ వార్‌ 2  నేపథ్యం గురించి నాకు సరైన అవగాహన వచ్చింది. అంతేకాదు మనం అడాల్ఫ్‌ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ పుస్తకం చదివాక నేను హిట్లర్ అభిమానిగా మారిపోయా.. ’’ అంటూ అతడు లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 

అతడు చేసిన ఈ ఘనకార్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 'హిట్లర్ ఓ నియంత.. ఏమాత్రం జాలి, దయ అనేవి లేకుండా.. ఎందరినో అన్యాయంగా హత మార్చిన అతడు నీకు నచ్చాడా..; అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున​ నీరభ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీరభ్‌ తన తప్పు సరిదిద్దుకుంటూ.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పోస్ట్‌ వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. ఆపై పోస్టును డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి.  

నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో.. డెలాయిట్‌ కంపెనీ.. నీరభ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాక.. అతడి చేసిన పోస్ట్‌కు తమకు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డెలాయిట్‌  సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా సంస్థ భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు. నీరభ్  అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-05-25T11:28:52Z dg43tfdfdgfd