వడ్ల కొనుగోలులో జాప్యంపై భగ్గుమన్న రైతులు.. ఆగని ఆందోళనలు

వడ్ల కొనుగోలులో జాప్యంపై భగ్గుమన్న రైతులు.. ఆగని ఆందోళనలు

  • జనగామ జిల్లాలోని విస్నూరులో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన
  • వడ్లు కొనాలని చాలాచోట్ల రాస్తారోకోలు.. ఆందోళనలు

మెదక్(శివ్వంపేట)/పాలకుర్తి/ అశ్వాపురం/ వర్ధన్నపేట/ మహబూబాబాద్‌‌ అర్బన్‌‌/ జనగామ అర్బన్‌‌ వెలుగు: వడ్ల కొనుగోళ్లు, మిల్లులకు తరలింపులోని జాప్యాన్ని నిరసిస్తూ గురువారం వేర్వేరు జిల్లాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. రాస్తారోకోలు చేసి నిరసన తెలిపారు. మెదక్​ జిల్లా శివ్వంపేటకు చెందిన రవితేజ అనే రైతు స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ముందు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఆ టైంలో అక్కడే ఉన్న బీజేపీ మండల అధ్యక్షుడు రవిగౌడ్ రైతును అడ్డుకున్నాడు. ఆఫీస్​ సిబ్బంది వచ్చి నీళ్లు కొట్టారు.

అనంతరం రైతు రవితేజ మాట్లాడుతూ.. తన పొలంలో పండించిన 12 క్వింటాళ్ల వడ్లను 20 రోజుల కింద గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చానని చెప్పాడు. వారం రోజుల కింద కాంటా పెట్టినా, లారీలు లేవనే కారణంతో ఇప్పటివరకు రైస్ మిల్లుకు తరలించలేదని వాపోయాడు. పైగా లారీలు రావడం లేదు.. మీ వడ్లను మీరే మిల్లుకు తీసుకెళ్లండని ఆఫీసర్లు చెప్పడంతో సమస్యను తహసీల్దార్​కు చెప్పుకుందామని వచ్చానని తెలిపాడు. అకాల వర్షాలకు పంట దెబ్బతినే పరిస్థితి ఉందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా.. ఇక్కడ గొడవ చేయకుండా వెళ్లిపోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ చారి కోప్పడ్డారని, చేసేదేంలేక ఆత్మహత్యకు యత్నించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై తహసీల్దార్​ను వివరణ కోరగా లారీల కొరతతో వడ్ల తరలింపు ఆలస్యం అవుతోందని చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

అలాగే వడ్ల కాంటాల్లోని ఆలస్యం, రైస్ ​మిల్లర్ల తీరును నిరసిస్తూ మెదక్ ​జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో గురువారం రైతులు ధర్నాకు దిగారు. దాయారలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తరుగు కింద బస్తాకు 2–3 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని ఆరోపించారు. అందుకు ఒప్పుకోకపోతే కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. సరిపడా లారీలను పంపాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, వైఎస్ఆర్టీపీ నాయకుడు రోహిత్ తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాస్ వచ్చి ఎంత నచ్చజెప్పినా రైతులు వినిపించుకోలేదు. ఆర్డీఓ వచ్చి సమస్య తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదలమని తేల్చిచెప్పారు.

దీంతో హైదరాబాద్ – బోధన్ రూట్​లో భారీగా ట్రాఫిక్ ​నిలిచింది. డీఎస్పీ సైదులు వచ్చి రైతులు, నాయకులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మెదక్​జిల్లా కౌడిపల్లి మండలం ‌‌‌‌‌‌‌‌కూకట్లపల్లి రైతులు గురువారం తహసీల్దార్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. హడావుడిగా కొబ్బరి కాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నాయకులు ఇప్పుడు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని వాపోయారు. 15 రోజులుగా వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని, కొనుగోళ్లులో వేగం పెంచాలని డిమాండ్​చేశారు. సరిపడా లారీలు పంపించాలని డిప్యూటీ తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం ఇచ్చారు.

10 రోజులుగా లారీలు రావట్లే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొల్లగూడెం కొనుగోలు కేంద్రానికి 10 రోజులుగా లారీలు రాకపోవడంతో వడ్ల కొనుగోళ్లు ఆగిపోయాయని గురువారం రైతులు రోడ్డెక్కారు. గ్రామంలోని మణుగూరు– పాల్వంచ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరావు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో  వడ్లు కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. 

చిన్న రైతుల వడ్లు కొంటలే

జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు గ్రామంలోని రైతు వేదిక ముందు వడ్లకు నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. పాలకుర్తి – మొండ్రాయి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పెద్ద రైతుల వడ్లనే కొంటున్నారని, చిన్న రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనుగోలు కేంద్రానికి తెచ్చి రెండు నెలలు దాటుతున్నా కాంటాలు పెట్టడం లేదని, పూర్తయిన వారి వడ్లను మిల్లుకు తీసుకెళ్లడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లర్లు వడ్లు దించుకోవట్లే

మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌‌ రైస్‌‌మిల్‌‌ ఓనర్లు వడ్లు దింపుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం కురవి – మహబూబాబాద్‌‌ హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐదు, ఆరు రోజుల కింద తీసుకొచ్చిన వడ్లను తీసుకొస్తే అన్‌‌లోడ్‌‌ చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గన్నీ బ్యాగుల్లేవ్​

వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఫిరంగిగడ్డ ఐకేపీ సెంటర్‌‌లో గన్నీ బ్యాగులు లేవంటూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన గన్నీ బ్యాగులను వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 40 వేలు ఇవ్వాలంటూ జనగామ మండలం వడ్లకొండలో గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అడిషనల్‌‌ కలెక్టర్‌‌ ప్రపుల్‌‌ దేశాయ్‌‌కు వినతిపత్రం అందజేశారు.

©️ VIL Media Pvt Ltd.

2023-05-26T02:59:02Z dg43tfdfdgfd