రూపాయి కోసం డాలర్ల అమ్మకం

  • కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ విక్రయం
  • మూడేండ్ల తర్వాత అమెరికా కరెన్సీని వదులుకున్న కేంద్ర బ్యాంక్‌

న్యూఢిల్లీ, మే 25: మూడేండ్ల తర్వాత … ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌బ్యాంక్‌ డాలర్లను విచ్ఛలవిడిగా విక్రయించింది. ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చర్యలూ తీసుకోని నేపథ్యంలో గత్యంతరం లేక భవిష్యత్‌ దిగుమతుల కోసం భద్రంగా ఉంచుకోవాల్సిన అమెరికా డాలర్లను భారీగా అమ్మేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ స్థూలంగా 212.57 బిలియన్‌ డాలర్లు స్పాట్‌ మార్కెట్లో విక్రయించగా, 187.054 బిలియన్‌ డాలర్లను కొన్నది. నికరంగా చూస్తే 25.516 బిలియన్‌ డాలర్ల విక్రయం జరిపినట్లయ్యింది. వాస్తవానికి వరుసగా మూడేండ్ల పాటు నికరంగా డాలర్లను కొనుగోలు చేసిన ఆర్బీఐ కేవలం రూపాయి పతనాన్ని నిరోధించడానికే గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించినట్టు ఫారిన్‌ ఎక్సేంజ్‌ నిపుణులు తెలిపారు. రష్యా-ఉక్రయిన్‌ యుద్ధం తర్వాత ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటడం, అమెరికా ఫెడ్‌ వరుస వడ్డీ రేట్ల పెంపుతో డాలరు మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ఠస్థాయి 83.30 వద్దకు పడిపోయిన సంగతి తెలిసిందే.

కరెంట్‌ ఖాతా దెబ్బ

గత ఆర్థిక సంవత్సరం ఒక్క జూలై నెలలోనే 19.05 బిలియన్ల విలువైన డాలర్లను ఆర్బీఐ వదులుకున్నది. అయితే 2023 మార్చి నెలలో మాత్రం 750 మిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధతో చమురు ధర భారీగా పెరిగిందని, దాంతో మన కరెంట్‌ ఖాతా లోటు (వచ్చి, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) తడిసిమోపెడయ్యిందని, దీంతో రూపాయి పతనమయ్యిందని బీవోబీ చీఫ్‌ ఎకానమిస్ట్‌ మదన్‌ సబ్నావిస్‌ చెప్పారు. ఫలితంగా ఆర్బీఐ డాలర్ల విక్రయానికి పాల్పడిందన్నారు.

విదేశీ పెట్టుబడులు వెనక్కి

దేశీయ మార్కెట్‌ నుంచి భారీగా విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలించుకుపోవడం రూపాయిని దెబ్బతీసిందని విశ్లేషకులు తెలిపారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 2022-23లో ఈక్విటీల నుంచి రూ.37,632 కోట్లు, డెట్‌ నుంచి రూ. 8,937 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు ఎన్‌ఎస్‌డీఎల్‌ డాటా వెల్లడిస్తున్నది. రిజర్వ్‌బ్యాంక్‌ డాలర్లను విక్రయించకుంటే రూపాయి విలువ 84-85 స్థాయిలకు క్షీణించేదని సీఆర్‌ ఫారెక్స్‌ అడ్వయిజర్స్‌ ఎండీ అమిత్‌ తెలిపారు.

2023-05-25T19:35:27Z dg43tfdfdgfd