న్యూఢిల్లీ, మే 25: రూ.2000 నోట్ల ఉపసంహరణ సెగ.. ప్రవాస భారతీయులు, విదేశాలకు వెళ్లిన పర్యాటకులకూ తగులుతున్నది. యూఏఈసహా గల్ఫ్ దేశాల్లో రూ.2000 నోట్ల మార్పిడి కష్టంగా మారింది. అక్కడి మనీ ఎక్స్‌చేంజీలు రూ.2000 నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. సాధారణంగా మనీ ఎక్స్‌చేంజీల్లో ఫారిన్ ఎక్స్‌చేంజ్ డీలర్లు కొంత ఫీజును తీసుకుని భారతీయ కరెన్సీని స్థానిక కరెన్సీలోకి మార్చి ఇస్తారు. అయితే రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోని మనీ ఎక్స్‌చేంజీల్లో రూ.2000 నోట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో ఈ నోట్లున్న ప్రవాస భారతీయులు, పర్యాటకులు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడినైట్టెంది.
రూ.2000 నోట్లను మళ్లీ మేము మార్చుకోగలమా? లేదా? అన్న భయంతోనే ప్రవాస భారతీయులు, టూరిస్టుల నుంచి ఆ నోట్లను తీసుకోవడం లేదని దుబాయ్‌లోని మనీ ఎక్స్‌చేంజ్ యూనియన్ల అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సదరు నోట్లను మీమీ భారతీయ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలనీ వారికి సూచిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను కూడా ఏ భారతీయులూ తీసుకోవడం లేదని అంటున్నారు. ‘చలామణి నుంచి ఉపసంహరిస్తున్నందున మా వద్ద ఇప్పటికే ఉన్న రూ.2000 నోట్లకు ఎక్స్‌చేంజ్ రేటు బాగా తగ్గుతున్నది. ఇది మాకు నష్టమే. అందుకే మరిన్ని నోట్లను తీసుకోవడం లేదు’ అని దుబాయ్‌లోని అల్ రజౌకి ఎక్స్‌చేంజ్ అధికారి ఒకరు అన్నారు.
2023-05-25T19:20:25Z dg43tfdfdgfd