పరిస్థితులను బట్టి వడ్డీరేట్లు మారుస్తాం : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: ధరల తగ్గుదలపై తాము సంతృప్తిగా లేమని, వీటిని తగ్గించడానికి ఇక నుంచి కూడా ప్రయత్నిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇన్ఫ్లేషన్విషయంలో అప్రమత్తంగా ఉంటామని పేర్కొన్నారు. ఇన్ఫ్లేషన్ తగ్గిందని, ఇది ఇక నుంచి 4.7 శాతం కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. దీనిపై యుద్ధం కొనసాగుతుందని కామెంట్ చేశారు. ఆహార ధరల తగ్గుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో దాస్ ఈ విషయాలు చెప్పారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం అకస్మాత్తుగా చెలరేగడంతో ఇన్ఫ్లేషన్ పెరిగిందని, ప్రపంచ సరఫరా గొలుసులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు.
ఇన్ఫ్లేషన్ తగ్గిందని, జీడీపీ వృద్ధి నిలకడగా ఉందని, కరెంట్ అకౌంట్ లోటు అదుపులో ఉందని అన్నారు. బ్యాంకింగ్ రంగం గ్రాస్ ఎన్పీఏల రేషియో డిసెంబర్ 2022 చివరి నాటికి 4.4 శాతంగా ఉందని దాస్ పేర్కొన్నారు. మొండిబాకీలు తగ్గుముఖం పట్టాయని, తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. బ్యాంకుల క్రెడిట్ గ్రోత్ పెరిగిందని, తాజా లెక్కల ప్రకారం ఇది 15.5 శాతంగా ఉందన్నారు. " ఇవన్నీగాక మనకు భారీగా జనాభా ఉంది. ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక జనాభా వల్ల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. మనదేశ వృద్ధికి జనసంఖ్య కీలకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అయితే భౌగోళిక రాజకీయ రంగంలో అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మనకు ఇబ్బందులు ఉంటాయి. ఎగుమతుల్లో మందగమనం మరొక సమస్య”అని అన్నారు.
దేశంలో పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లను మారుస్తామని, ఈ విషయంలో తాను సొంతంగా నిర్ణయం తీసుకోనని దాస్ ఈ సందర్భంగా అన్నారు. రాబోయే మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలలో ఆర్‌బీఐ రేట్లను మార్చవద్దని చాలా మంది తనకు సూచిస్తున్నారని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ కీలకమైన బెంచ్‌మార్క్ పాలసీ రేటును యథాతథంగా 6.5 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. దీనికి ముందు ఆర్‌బీఐ మే 2022 నుంచి రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. "రేట్ల పెంపు నా చేతుల్లో లేదు. ఇదంతా గ్రౌండ్లెవెల్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ల పోకడలు, ఇన్ఫ్లేషన్వంటి విషయాల ఆధారంగా మేం ఒక నిర్ణయానికి వస్తాం " అని గవర్నర్ అన్నారు.
రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణపై మాట్లాడుతూ ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని, జనానికి ఇబ్బందులు కలగకుండా మొత్తం కసరత్తు పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ తన కరెన్సీ నిర్వహణలో భాగంగా రూ. 2000 డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది మంగళవారం నుంచి ఒకేసారి రూ. 20 వేల వరకు రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి అనుమతించింది. డిపాజిట్ విండో సెప్టెంబర్ 30, 2023 వరకు ఉంటుంది. "నోట్ల మార్పిడికి నాలుగు నెలలు గడువు ఇచ్చాం. బ్యాంకుల్లో సోమవారం ఎక్కడా రద్దీ లేదు. మేం పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం. ఈ విషయంలో పెద్ద సమస్యలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. వ్యాపార కార్యకలాపాలు ఎప్పట్లాగే జరుగుతున్నాయి" అని ఆయన వివరించారు.
©️ VIL Media Pvt Ltd. 2023-05-25T03:13:41Z dg43tfdfdgfd