‘కోహినూర్’లో ఐటీ సోదాలు.. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల్లో తనిఖీలు
‘కోహినూర్’లో ఐటీ సోదాలు
హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల్లో తనిఖీలు
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు పాల్పడుతున్నారన్న అనుమానంతో దాడులు
హైదరాబాద్, వెలుగు : ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కోహినూర్ గ్రూప్‌తో పాటు మరో రెండు సంస్థలపై బుధవారం ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. అత్తాపూర్‌లోని కోహినూర్ క్లాసిక్ టవర్ కార్పొరేట్ ఆఫీస్‌లో ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించారు. మైలార్ దేవ్‌పల్లి, శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ మజీద్ ఇల్లు, కంపెనీ డైరెక్టర్స్ ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్, రాజేంద్రనగర్‌లోని శాస్త్రీపురం, మాదన్నపేట్, శంషాబాద్, అత్తాపూర్, కొండాపూర్ సహా 24 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు.
ఐదు రోజుల సెర్చ్ వారెంట్‌తో తనిఖీలు చేస్తున్నారు. గత ఐదేండ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. కంపెనీల హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు మరో రెండ్రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కోహినూర్ డెవలపర్స్ భారీ ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వెంచర్స్, విల్లాస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలో వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు పార్ట్‌నర్స్‌గా ఉన్నట్లు తెలిసింది. ఓ ప్రముఖ నాయకుడు ఈ కంపెనీకి బినామీగా ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2023-05-25T03:58:39Z dg43tfdfdgfd