కడెం మళ్లీ పాతకథే!.. ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

కడెం మళ్లీ పాతకథే!.. ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

  • కడెం మళ్లీ పాతకథే!
  • పర్మినెంట్ రిపేర్లు చేయట్లే.. కొత్త గేట్లు పెట్టట్లే
  • టెంపరరీ పనులతో మమ అనిపిస్తున్నరు 
  • 6 కొత్త గేట్లు నిర్మించాలని చెప్పిన ఎక్సపర్ట్స్​ టీమ్
  • రూ.772 కోట్లు కేటాయించాలని ప్రపోజల్​
  • దగ్గరకొస్తున్న వానాకాలం.. స్పందించని ప్రభుత్వం
  • ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

 నిర్మల్,  వెలుగు :  నిర్మల్ జిల్లాలోని  కడెం ప్రాజెక్టుకు ఈసారి కూడా వరద ముప్పు  పొంచి ఉందన్న సంకేతాలు వెలువడ్తున్నాయి.  కొన్నేండ్ల  నుంచి ఈ ప్రాజెక్టుకు పర్మినెంట్​ రిపేర్​ పనులు చేయకుండా కేవలం టెంపరరీ రిపేర్లు చేస్తుండడంతో ప్రతీ  వానాకాలంలోనూ  ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు  వెళ్తోంది.  గతేడాది వానాకాలంలో  ప్రాజెక్టులోకి  6 లక్షల  క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.  ప్రాజెక్టు  కెపాసిటీ మూడు లక్షల  క్యూసెక్కులు కాగా దీనికి రెండింతల వరద నీరు ప్రాజెక్టును ముంచెత్తింది.  వరద ఉధృతితో ప్రవాహమంతా ప్రాజెక్టు పైనుంచి పొంగిపొర్లి  లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.  ఓ దశలో వరద ఉధృతికి  ప్రాజెక్టు కొట్టుకుపోతుందా అని వణికిపోయారు. దాదాపు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని 18 గ్రామాలను ఆఫీసర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అదృష్టవశాత్తు వరదను తట్టుకొని ప్రాజెక్టు నిలబడడంతో ప్రజలు, ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.  అయినప్పటికీ సంబంధిత ఆఫీసర్లు  పర్మినెంట్​పనులు చేపట్టకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. 

సీడీవో ప్రపోజల్స్​..

ప్రస్తుతమున్న 18 గేట్లకు అదనంగా మరికొన్ని గేట్లను ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్​ ఏండ్లుగా వస్తోంది. ఆఫీసర్లు కేవలం ప్రపోజల్స్​ తయారుచేయడం.. సర్కారుకు పంపడం.. సర్కారు వాటిని పెం డింగ్ లో  పెట్టడం రివాజైంది. మూడు నెలల కింద సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ (సీడీవో )  ప్రాజెక్టును వరద నుంచి కాపాడేందుకు కోసం ప్రస్తుతం ఉన్న 18 గేట్లతో పాటు మరో ఆరు గేట్లను అదనంగా నిర్మించాలని ప్రపోజ్​ చేసింది. దీనికోసం దాదాపు  రూ. 772 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్​పై  కనీస స్థాయిలో కూడా స్పందించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2018 లో వరదలు వచ్చినప్పుడు దెబ్బతిన్న ప్రాజెక్టు పనుల కోసం మంజూరైన ఫండ్స్​తో  ప్రస్తుతం రిపేర్​పనులు జరుపుతున్నారు. ప్రస్తుతం స్క డా కింద జరుగుతున్న పనులు మామూలు వరదను మాత్రమే నిరోధిం చగలవని అదనపు గేట్లను ఏర్పాటు చేస్తేనే వరద ఉధృతి నివారించే చాన్స్​ ఉంటుందని, లేనట్లయితే గత వానాకాలం మాదిరిగా ఈసారి కూడా వరద వస్తే మాత్రం ప్రాజెక్టుకు ముప్పు తప్పదని ఇంజినీరింగ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.   వానాకాలం ప్రారంభం నాటికి పనులు పూర్తవడం కూడా కష్టమేనని చెబుతున్నారు.

స్కడా పనులతో చేతులు  దులుపుకునే యత్నం...

2018 లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎల్ఎండీ, ఎస్సా రెస్పీ, కడెం ప్రాజెక్టులను ఆధునికరించేందుకు స్కడా( సూపర్​వైజరీ కంట్రోల్ అండ్  డాటా ఆక్విజేషన్)  కింద  రూ. 6 కోట్లు కేటాయించింది.  ఎస్సారెస్పీ పనులు ఇప్పటికే పూర్తికాగా కడెం ప్రాజెక్టు పనులు మాత్రం ఆలస్యమవుతున్నాయి. స్కడా కింద చేపట్టే పనులతో గేట్లకు ఆటోమేటిక్ ఆన్, ఆఫ్ సిస్టం ఏర్పాటు చేయడం, అలాగే వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సెన్సార్లను ఏర్పాటు చేయడం,  ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నిర్మించడం లాంటి పనులను చేస్తున్నారు. దీనికోసం స్పెషల్ సాఫ్ట్ వేర్  రూపొందించారు. కంట్రోల్ రూమ్ కు ప్రతీ గేటుకు ఏర్పాటు చేసే  సెన్సార్ ను అనుసంధానం చేయనున్నారు. అలాగే  కడెం వాగు పరిధిలోని ఇంద్రవెల్లి, కుప్టి,  సదర్మాట్ వద్ద గల పలికేరు వాగులో మూడు గేజ్​లను  ప్రాజెక్టులోకి వచ్చే వరద ఉధృతిని తెలుసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే  ప్రస్తుతం ఉన్న 18 గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్, కార్డియం కాంపౌండ్,  రూప్స్  ఫ్రీ క్లీనింగ్ లాంటి పనులు చేస్తున్నారు.  మొన్నటి వరదలతో కొట్టుకుపోయిన రెండు గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్లను కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీసర్లు సెంట్రల్  డిజైన్ ఆర్గనైజేషన్  సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా టెంపరరీ పనులను చేస్తుండడం అలాగే కీలకమైన అదనపు గేట్లను ఏర్పాటు చేయకపోతుండడం మరోసారి కడెంకు ప్రమాదం ముప్పు పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

ప్రాజెక్టు నిర్వహణకు స్టాఫ్ కొరత..

కడెం ప్రాజెక్టును సిబ్బంది కొరత వెంటాడుతోంది. వరదల టైంలో కాకుండా సాధారణంగా కాల్వలకు నీటిని విడుదల చేయడం, రాత్రింబవళ్లు ప్రాజెక్టు అబ్జర్వేషన్​, జనరేటర్ నిర్వహణ, గేట్ల ఆపరేషన్ లాంటి పనులు చేపట్టేందుకు సరిపోయేంత సంఖ్యలో సిబ్బంది లేకపోవడం కూడా ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. ఆరుగురు జూనియర్ ఇంజినీర్లు ప్రాజెక్టు నిర్వహణకు అవసరం కాగా ప్రస్తుతం ఒక్క జూనియర్ ఇంజనీర్ మాత్రమే డ్యూటీలో ఉన్నారు. అలాగే ఇద్దరు ఎలక్ట్రిషన్లు,  ఫిట్టర్, గేట్ ఆపరేటర్, జనరేటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను అవుట్  సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహిస్తున్నప్పటికీ అనుభవం ఉన్న సిబ్బంది లేకపోతుండడం వరదల సమయంలో ఇబ్బందిగా మారుతుంది.

రిపేర్లు కొనసాగుతున్నాయి...

కడెం ప్రాజెక్టుకు రిపేర్లు కొనసాగుతున్నాయి.  స్కడా కింద జరుగుతున్న ఈ పనులను జూన్ మొదటి వారంలో పూర్తయ్యేలా చూస్తున్నాం.  ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ల రిపేర్​, ఆయిలింగ్, గ్రీసింగ్ పనులు జరుగుతున్నాయి. రెండు గేట్లకు  కౌంటర్ వెయిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.  సీడీవో ప్రపోజ్​ చేసిన అదనపు 6 గేట్లను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది.  వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. జూన్,  జులై నెలల్లో ప్రాజెక్టు నీటిమట్టం 690 ఫీట్లు ఉండేటట్లు చూడాలని పైఆఫీసర్లు మాకు సూచించారు.

- బోయదాసు, డీఈ, కడెం ప్రాజెక్టు

©️ VIL Media Pvt Ltd.

2023-05-25T03:58:40Z dg43tfdfdgfd